పండగ మాట మర్చిపోయిన టాలీవుడ్…!

దసరా, దీపావళి పండగలొస్తున్నాయంటే టాలీవుడ్‌కి ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. కొత్త సినిమా రిలీజులతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. కానీ ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడమే కష్టంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావం తగ్గే వరకు థియేటర్ల ఓపెనింగ్‌కి పర్మిషన్‌ ఇవ్వకపోవడమే మంచిది అనుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఇక నిర్మాతలు కూడా ఈ ఏడాది సినిమాలు రిలీజ్ చెయ్యకపోవడమే బెస్ట్ అనుకుంటున్నారు.

2020లో టాలీవుడ్‌ పండగ అన్న మాటనే మరిచిపోతోంది. రాష్ట్రప్రభుత్వాలు అనుమతిస్తే అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది కేంద్రం. అయితే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎగ్జిబిటర్లు కూడా సినిమా హాళ్లు తెరవడానికి ఆసక్తి చూపించట్లేదు. కరోనా ప్రభావం తగ్గేవరకు సినిమాలు రిలీజ్‌ చెయ్యకపోవడమే బెస్ట్‌ అనుకుంటున్నారు నిర్మాతలు. దీంతో 2020కి సంక్రాంతి హిట్స్‌తోనే శుభం కార్డ్‌ పడుతుంది అంటున్నారు విశ్లేషకులు. అందుకే పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉన్న నాగచైతన్య, సాయి పల్లవి ‘లవ్‌ స్టోరీ’ వచ్చే ఫిబ్రవరి 14ని లాక్‌ చేసుకుంటోందట.

ఏప్రిల్‌, మేనెలల్లో రిలీజ్‌ కావాల్సిన చాలా సినిమాలు దసరా బరిలో దిగాలనుకున్నాయి. సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, రామ్ ‘రెడ్’, రానా ‘అరణ్య’ సినిమాలు పండగ సీజన్‌లో రిలీజ్‌ అవుతాయనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి పరిస్థితులు చూసి అసలు ఈ ఏడాది బరిలో దిగకపోవడమే మంచిది అనుకుంటున్నారట నిర్మాతలు.