అమెరికా అధ్యక్ష ఎన్నికల సంగ్రామానికి వేళైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చెలాయించే అమెరికా దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే తదుపరి నేతను నేడు అమెరిక్లను తేల్చనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ అమీ తుమీ తేల్చుకోనున్నారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓటు వేసేలా సర్వం సిద్ధం చేశారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మెయిల్, ముందస్తు ఓటింగ్ ద్వారా దాదాపు పది కోట్ల మంది ఓటు వేశారు. అంటే 38 శాతం మంది తమ ఓట్లను ముందుగానే వేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 2016 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లలో… మూడింట రెండు వంతుల ఓట్లు ఇప్పటికే పోలయ్యాయి.
దాదాపు 24 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లున్న అమెరికాలో 65 శాతానికి పైగా తెల్లజాతీయులు ఉన్నారు. ఆసియన్లు, ఆఫ్రో అమెరికన్లు, ఐరోపాతో పాటు ఇతర వలసదారుల ఓటర్లు 35శాతం మంది ఉన్నారు. వీరంతా 538 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు సాధించిన వ్యక్తి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తాడు. మరోవైపు ఇవాళ రాత్రికే ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని, కొన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టొచ్చని అంటున్నారు. మాదే అంటే మాదే అని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఎలా ఉన్నా … తుది ఫలితాలు వచ్చే వరకూ ఉత్కంఠ కొనసాగేలా ఉంది.