కల్తీ మద్యంతో 26 మంది మృతి.. అధికారుల ధ్రువీకరణ.. పరిహారం ప్రకటించిన సీఎం

-

బిహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తరచూ కలకలం రేపుతోంది. ఇప్పటికే దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహారిలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధరించారు. మరో 20 మంది ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు మోతిహారి ఎస్పీ కాంతేశ్ కుమార్ తెలిపారు. కల్తీ మద్యం కేసులో 80 మందిని అరెస్ట్ చేశామని ​వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు పోలీసులు, 9 మంది వాచ్‌మన్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

మొదట ఈ మరణాలు కల్తీ మద్యం వల్ల సంభవించాయని ప్రభుత్వం ధ్రువీకరించలేదు. తాజాగా మోతిహరి ఎస్పీ కాంతేశ్ కుమార్​.. 26 మంది కల్తీ మద్యానికి బలైనట్లు ధ్రువీకరించారు. తుర్కౌలి పోలీస్ స్టేషన్​ పరిధిలో 11 మంది, హర్సిద్ధిలో ముగ్గురు, పహర్‌పూర్‌లో ముగ్గురు, సుగౌలీలో ఐదుగురు మరణించినట్లు కాంతేశ్ కుమార్ తెలిపారు.

ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పందించారు. ఇదొక బాధాకరమైన సంఘటన అని అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్​ నుంచి రూ.4లక్షల పరిహారం ఇస్తామని నీతీశ్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news