40ఏళ్ల అనుభవం.. ఎన్నో చూశాను.. నాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడం ద్వారా పార్టీని కాపాడాను.. ఒకానొక సమయంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాను.. ప్రధానులను నిర్ణయించేస్థాయికి చేరాను.. రాష్ట్రపతులను ఎంపికచేసే వరకూ వెళ్లాను.. జగన్ ఎంత.. వైకాపా ఎంత.. అంటూ నిన్నమొన్నటివరకూ తనదైన ప్రసంగాలు చేసేవారు చంద్రబాబు! కానీ… జగన్ వచ్చి ఏడాది అయిన అనంతరం బాబు మాట మూగబోయింది.. ఆన్ లైన్ లో కళ్లు తుడుచుకునేవరకూ వెళ్లింది.. జూం కే పరిమితమయ్యేలా చేసింది!
“కాలం గేలం వేస్తే బాబు బ్రతుకు కరోనాపాలయ్యింది” అన్నట్లుగా మారింది చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు! పక్కా ప్లానింగ్ ఉండాలి కానీ… కరోనా అయితే మాత్రం ఏమిటి.. అన్నవిధంగా జగన్ దూసుకుపోతున్నారు. సో… బాబు పతనానికి కరోనానే పూర్తి కారణం కాదన్నమాట! మరేమిటి కారణం… ఆయన చేసిన తప్పులే ఆయన్ను వెంటాడుతుండటం! ఇవన్నీ కలిపి నేడు బాబును దిగ్భందనం చేసే అవకాశాన్ని, బలాన్ని జగన్ కి ఇచ్చాయి!!
చంద్రబాబు “ఊ” అంటే చాలు జగన్ పై అంతెత్తున లేచే అచ్చెన్నాయుడు.. పోలీసుల అదుపులో ఉన్నారు. బాబు “ఊ” అనకపోయినా సరే ఉచ్చనీచాలు మరిచి జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేసే జేసీ బ్రదర్స్ పీకల్లోతు మునిగిపోయారు! జగన్ “ఊ” అంటే వైసీపీలోకి జంప్ చేయడానికి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. జగన్ “ఊ” అనకపోయినా వస్తామని అడిగేవారు పుష్కలంగా ఉన్నారు! వీటన్నింటి మధ్య… అందొస్తాడనుకున్న కొడుకు పరిపూర్ణమైన అసమర్ధుడిగా మిగిలిపోతున్నాడు!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వచ్చినప్పటికీ… మున్సిపాల్టీ ప్రత్యేక అధికారుల పాలన పొడిగించడం ద్వారా ఆ కాస్త ఆశ ఆవిరైంది. మరోపక్క సంక్రాంతి కానుకలపై సీబీఐ ఎంక్వైరీల తలపోటు. కేంద్రం పెద్దల సహాయం అడుగుదామంటే… రాష్ట్రంలో బాబుకి వంతపాడే కన్నా పోయి, మాటి మాటికీ గిల్లే వీర్రాజు వచ్చి కూర్చున్నారు! ఇన్ని పరిస్థితుల మధ్య… మరో భారీ దెబ్బ బాబుకి తగిలింది.. అదే అమరావతి!
అమరావతి వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎప్పటికి మేలు జరిగేనో తెలియదు కానీ… బాబు & కోలు మాత్రం ఆర్ధికంగా బలపడటానికి, స్థిరపడటానికి బలమైన కారణంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దీంతో… జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం, అమరావతిపై చంద్రబాబు పెట్టుకున్న ఆశలన్నీంటినీ గల్లంతు చేసేసింది! ఈ దశలో చంద్రబాబుకి ఏం చేయాలో పాలుపోక జూం నే నమ్ముకున్నారు.. టెంపరరీ ఆనందాలకోసం కోర్టులల్లో కేసులు వేస్తున్నారు! దీంతో… 40ఏళ్ల అనుభవం… జగన్ దిగ్భందానికి బలి అయ్యిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!!