కరోనా వచ్చిన వారిలో చాలా మందికి ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. కేవలం కొద్ది మందికి మాత్రమే ఐసీయూలో చికిత్సను అందివ్వాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల స్వల్ప, మధ్యస్థ లక్షణాలు వచ్చి ఇంట్లో చికిత్స తీసుకునే వారికి సడెన్ గా ఇన్‌ఫెక్షన్ ఎక్కువై ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. దీంతో వారికి హాస్పిటల్‌లో చికిత్స అందించే లోపే ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వైద్యులు ప్రస్తుతం కోవిడ్ చికిత్సను 3 స్టేజ్‌లుగా విభజించారు.
కరోనా ఐసొలేషన్ సమయం 14 రోజులు. అంటే ఆలోగా కోవిడ్ తగ్గుతుంది. ఈ క్రమంలోనే మొత్తం 14 రోజుల సమయాన్ని 3 భాగాలుగా విభజించారు. 1-4, 5-10, 11-14 అని మూడు భాగాలు చేశారు. కోవిడ్ వచ్చాక 1-4 రోజులస్టేజ్‌లో బాగానే ఉంటుంది. ఈ దశలో ఎవరైనా సరే ఇంట్లోనే ఉండి చికిత్సను తీసుకుంటారు. కానీ 5-10 రోజుల స్టేజ్‌కు వచ్చే సరికి వారిలో ఇన్‌ఫెక్షన్ ఎక్కువవుతుంది. దీంతో పరిస్థితి తీవ్రతరం అవుతుంది. అయితే ఈ స్టేజ్‌ను దాటితే ప్రాణాలతో బయట పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక కోవిడ్ వచ్చాక ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే వారు మొదటి 4 రోజుల తరువాత ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మొదటి 4 రోజుల తరువాత కొందరికి పరిస్థితి తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, గుండె జబ్బులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మొదటి 4 రోజుల అనంతరం.. అంటే 5-10 రోజుల స్టేజ్‌లో ఇన్‌ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో వాపులు బాగా కనిపిస్తాయి. ఈ దశలో రోగ నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌పై పోరాడలేక చేతులెత్తేస్తుంది. ఫలితంగా పరిస్థితి తీవ్రతరం అవుతుంది. కనుక ఈ దశకు ముందే జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలు మరింత ఎక్కువవుతున్నట్లు అనిపిస్తే వెంటనే హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక 5-10 రోజుల దశ దాటాక 11-14 రోజుల స్టేజ్ ఉంటుంది. ఇందులో కరోనా పేషెంట్లకు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. కొందరికి లక్షణాలు పూర్తిగా ఉండవు. ఇది కోలుకునే దశ. ఈ దశకు వస్తే ఎవరికైనా ప్రాణాపాయం సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక రెండో దశ కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.