హైదరాబాద్ ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో రాధిక అనే నగల వ్యాపారి వద్ద పనిచేస్తూ ఈనెల 17న రూ.7కోట్ల వజ్రాభరణాలున్న కారుతో డ్రైవర్ పరారైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన డ్రైవర్ శ్రీనివాస్‌ను పోలీసులు మంగళవారం రోజున పట్టుకున్నారు. నగలతో ఉడాయించిన శ్రీనివాస్.. కారును కూకట్‌పల్లి సమీపంలో వదిలేసి నర్సంపేట ప్రాంతంలో ఉండే బంధువు ఇంటికెళ్లాడని పోలీసులు తెలిపారు. పెట్రోలు ఖర్చుల నిమిత్తం యజమాని రాధిక ఇచ్చిన డెబిట్‌కార్డుతో సెల్‌ఫోన్ కొన్నాడని చెప్పారు. కొత్త ఫోను కొని తన బంధువుకిచ్చి.. అతని ఫోన్‌ను శ్రీనివాస్ తీసుకున్నాడని వెల్లడించారు.
డెబిట్‌కార్డుతో కొనుగోలు చేసిన ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా పోలీసులు శ్రీనివాస్ బంధువును పట్టుకున్నారు. అప్పటికే అతడు బస్సులో తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామం కొవ్వూరుకు వెళ్లి నగలను గొయ్యి తీసి పాతిపెట్టాడు. పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నగలతో సహా నిందితుడిని అరెస్టు చేసింది. చోరీ సొత్తుకు ఎటువంటి బిల్లులు, లెక్కలు లేకపోవడంతో ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు.