నాకీరోజు ఆఫీసు లేదు. నీకేమో ఈరోజే ఇంపార్టెంట్. ఇంట్లో ఒక్కదాన్నే. ఉదయం బానే ఉంటుంది. మద్యాహ్నం ఒక సినిమాతో గడిచిపోతుంది. సాయంత్రం అయితేనే ఇక టీవీ ముందు కూర్చోబుద్ధి కాదు. ఎప్పుడు వస్తావా అని గుమ్మం వైపు చూస్తూ కూర్చుంటా. ఆరవుతుంది, తలుపు చప్పుడు కాదు. ఏడవుతుంది, కాలింగ్ బెల్ మోగదు. ఎనిమిదవుతుంది, ఫోన్ రింగ్ అవదు. గదంతా నిశ్శబ్దం. నాలో తప్ప.
గంట గంటకీ గదిలో నిశ్శబ్దం పెరిగిపోతుంటే గుండెలో సవ్వడి ఎక్కువవుతూ ఉంటుంది. ఒకే చోట కూర్చోలేను. అటూ ఇటూ తిరిగితే కాళ్ళ నొప్పులు మొదలవుతాయి. దాంతో పాటు చిరాకు, అక్కడ నుండి కోపం, ఏం చేయాలో తెలియదు. చేతిలో ఫోన్ ఉన్నా నువ్వు చెప్పింది గుర్తొచ్చి ఆగిపోతా. అప్పుడప్పుడు ఏదైతే అదైందని డయల్ చేస్తా. కానీ అంతలోనే కట్.
నువ్వు వస్తావని ఏమీ వండలేదు.
ఆ గిన్నెలు నన్ను చూసి నవ్వుతున్నాయి
నీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు.
బీన్ బ్యాగు, సోఫా చిరాకు పడుతున్నాయి.
ఒకే దగ్గర కూర్చోవట్లేదని.
గోడ గడియారం గొప్పలు పోతుంది.
మాటిమాటికీ దాని వంక చూస్తున్నానని.
కాలి చెప్పులు సంతోష పడుతున్నాయి.
ఈరోజు తమ బాధ తీరిందని.
సీలింగ్ ఫ్యాన్ అలసిపోయింది. తిరిగీ.. తిరిగీ..
షెల్ఫ్ లో పుస్తకం తనని తీసుకోమని చెప్తుంది.
నాకు నువ్వు కావాలంటాను. దానికర్థం కాదు.
చుట్టూ ఉన్నఉన్న ప్రతీ వస్తువు ఏదో ఒకటి అంటూనే ఉంది. ఒక్క ఫోన్ తప్ప.
ఏదైనా అంటే విసిరిపారేస్తానని దాని భయం కావచ్చు.
కూర్చుని కూర్చుని అలసిపోయాను. నిలబడి నిలబడి నడుము నొప్పి తెచ్చుకున్నాను. నన్నింతలా బాధపెడుతున్న నిన్ను చెడామడా తిట్టాలనుంది. ఇంత ఆలస్యమయితే చిన్న ఫోన్ కూడా చేయలేవా? ఆఫీసుకెళ్తే ఇంట్లో భార్య ఉందన్న విషయమే మర్చిపోతావా? పిచ్చి దానిలాగా అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా అని అరిచి, నువ్వేదైనా చెప్పే లోపే ఏడ్చి, నీకు దూరం జరిగి, తలుపు వేసుకోకుండానే బెడ్రూంలోకి వెళ్ళిపోవాలనుంది.
నువ్వొస్తే ఇలాగే చేస్తానని నాకు తెలుసు. కానీ అలా జరగడానికి కూడా ఆలస్యం అవుతుందనేదే నా బాధ. నువ్వ్వు తొందరగా వస్తే బయటకెళ్దామని ఇప్పటిదాకా ఎదురుచూసాను. కానీ ఇప్పుడు, నువ్వు తొందరగా వస్తే తొందరగా తిట్టి, ఏడ్చి, అలిగి నీతో బతిమాలించుకోవాలనుంది. దానిక్కూడా నువ్వు ఆలస్యం చేస్తున్నావు.
మొగుడిగా మారితే మగాళ్ళు మారిపోతారా? ఆడాళ్ళిలా అవస్థలు పడాల్సిందేనా? ఇంకెన్నాళ్ళు.. నాలో స్త్రీవాద ఆలోచనలు పెరగకముందే తొందరగా వచ్చెయ్. లేకపోతే ఉద్యమం లేవదీస్తా. ఆడవాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సాయంత్రం ఆరుకల్లా మగాడు ఇంట్లో ఉండాలన్న చట్టం తీసుకొస్తా. అప్పుడు గానీ నీకు బుద్ధి రాదు.
అదిగో వచ్చేసావా..
నాలో చిరాకు నషాలానికి అంటి, కుతకుత ఉడికిపోతున్న సమయంలో తలుపు తీయగానే నువ్వు కనిపించి, దాంతో కనిపించని స్థాయిలోకి చిరాకు పెరిగి, ముఖం మీదనే తలుపు మూసేసి, గడియ పెట్టకుండానే గదిలోకి వస్తే, ఉరుకు పరుగున నా దగ్గరికి వచ్చి, నేనేం తిట్టినా పడుతూ, ఏడిస్తే ఓదారుస్తూ, నా అలకని అర్థం చేసుకుని పక్కనే ఉన్న నిన్ను చూసి, నా అహం సంతృప్తి చెంది, ఇంకోసారి ఇలా చేయవు కదా అని మాట తీసుకుని, అప్పటిదాకా నవ్విన గిన్నెల వైపు చూస్తూ, నువ్వు తెచ్చిన బిర్యానీ ఆరగిస్తుంటే నాకో ఆలోచన వచ్చింది.
నీకు ఆఫీసు లేనపుడు నాకోసం నువ్వింతలా పరితపిస్తావా?
దానికి సమాధానం కనుక్కోకముందే ఆలోచన మార్చేసాను.
ఇప్పుడే కుదుటపడ్డ నా మనసును మళ్ళీ బాధపెట్టడం ఇష్టం లేదు నాకు.