భర్తపై కోపంతో.. 65 కిలోమీటర్లు నడిచిన గర్భవతి.. ఆ తరువాత..

-

ఓ నిండు చూలాలు భర్తతో గొడవపడిన ఆ కోపంతో 2 రోజుల పాటు రాత్రి, పగలు 65 కిలోమీటర్లు నడించింది. దీంతో.. ఆమె అవస్థను రోడ్డున వెళ్లే ఓ వ్యక్తి గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో అందులోనే ఆమెకు కాన్పు అయింది. ఈ ఘటన నాయుడుపేటలో చోటు చేసుకుంది. ఆమెది తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ నగర్ కు చెందిన వర్షిణి కూలిపనుల కోసం భర్తతో తిరుపతి వచ్చింది. భర్త చీటికిమాటికి గొడవ పడుతుండడంతో విసుగు చెందిన ఆమె చేతిలో రూపాయి లేకున్నా తిరుపతి నుంచి కాలినడకన బయలుదేరింది. మార్గమధ్యంలో ఆగుతూ రెండు రోజులపాటు పగలురాత్రి నడుస్తూ నాయుడుపేట చేరుకుంది. మొత్తంగా 65 కిలోమీటర్లు నడిచిన ఆమె శుక్రవారం అర్ధరాత్రి నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు.

Free photo Pregnant Pregnancy Pregnant Woman M Mother - Max Pixel

మరోవైపు, నిండు గర్భిణి కావడంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. రోడ్డుపై వచ్చిపోయే వాహనాలను ఆపినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఓ యువకుడు స్పందించి వర్షిణిని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే 108కి ఫోన్ చేసి సమచారం అందించాడు. వారు సకాలంలో అక్కడికి చేరుకుని ఆమెను అంబులెన్స్‌లోకి చేర్చారు. అయితే, అప్పటికే బిడ్డ కిందికి జారిపోతుండడంతో విషయం అంబులెన్స్‌ సిబ్బందికి చెప్పింది. వారు వెంటనే ప్రసవం చేశారు.

రెండు రోజులపాటు తిండీతిప్పలు లేకపోవడంతో వర్షిణి బాగా నీరసపడిపోయింది. దీంతో వెంటనే పాలు, రొట్టె తెప్పించి తినిపించారు. తమ ఇళ్ల నుంచి దుస్తులు తెప్పించి తల్లీబిడ్డకు ఇచ్చారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పుట్టిన ఆడ శిశువు బరువు తక్కువగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. కాగా, వర్షిణి తన భర్త పేరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పేందుకు నిరాకరించడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news