13 రోజుల్లో 5 కోట్లు – ‘ఆరోగ్యసేతు’ యాప్‌ డౌన్‌లోడ్లు

-

‘ఆరోగ్యసేతు’ యాప్‌ డౌన్‌లోడ్లు నిన్నటి నుంచి 24 గంటల్లో కోటికి పైగా చేరుకున్నాయని తెలుస్తోంది. ప్రధాని నిన్నటి తన సందేశంలో ఆరోగ్యసేతును డౌన్‌లోడ్‌ చేసుకొమ్మని సూచించిన సంగతి విదితమే.

‘‘5 కోట్లకు చేరుకోవాడానికి టెలిఫోన్‌కు 75 ఏళ్లు పట్టింది. రేడియోకు 38 సంవత్సరాలు, ఇంటర్‌నెట్‌కు 4 ఏళ్లు, ఫేస్‌బుక్‌కు 19 నెలలు, పోకెమాన్‌ గో కు 19 రోజలు….. కరోనాతో పోరాడటానికి పుట్టిన ‘ఆరోగ్యసేతు’కు కేవలం 13రోజులు… ప్రపంచంలో ఏ యాప్‌ ఇంత వేగంగా చేరుకోలేదు’’.

‘ఆరోగ్యసేతు’ అప్లికేషన్‌ డౌన్‌లోడ్లు కేవలం 13 రోజుల్లో 5 కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2న విడుదల చేసిన ఈ యాప్‌, కొవిడ్‌-19 కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేయడం ద్వారా దేశంలో కరోనా విస్తృతిని నియంత్రించడానికి ఉద్దేశించింది. విడుదలైన మూడు రోజుల్లోనే 50 లక్షల డౌన్‌లోడ్లు సాధించడం విశేషం.

నితి ఆయోగ్‌ సిఈఓ అమితాబ్‌ కాంత్‌ ఈ విషయాన్ని తెలుపుతూ, ఓ ప్రకటన విడుదల చేసారు. కేంద్ర ప్రభుత్వం స్వంతంగా తయారుచేయించిన ఈ యాప్‌, దేశంలో కరోనా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు ఉపయోగపడేలా డిజైన్‌ చేసారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జాతినుద్దేశించి చేసిన తన ప్రసంగంలో ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రోత్సహించిన 24 గంటల్లోనే కోటికి పైగా డౌన్‌లోడ్లు కావడం రికార్డుగా పేర్కొంటున్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా ఈ యాప్‌ను వాడాల్సిందిగా తమ తమ సిబ్బందికి, సభ్యులకు సూచించాయి.

ఈ ‘ఆరోగ్యసేతు’ యాప్‌, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండింటిలోను లభిస్తోంది. ఇంగ్లీష్‌, హిందీ మాత్రమే కాక, ఇది అన్ని ముఖ్యమైన భారతీయ భాషలలో కూడా లభ్యమవుతోంది. వినియోగదారులు ఈ యాప్‌ను వాడేప్పుడు బ్లూటూత్‌, లొకేషన్‌ ఆక్సెస్‌ అనుమతులు మాత్రం ఇవ్వాలి. తద్వారా ఇది కొవిడ్‌ బాధితుల జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది. వినియోగదారులను కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని అంచనావేసి, సురక్షితంగా ఉన్నారో లేదో తెలుపుతుంది. అలాగే, మనం ఎవరైనా పాజిటివ్‌ వ్యక్తిని కలిసామా? లేదా అన్నది కూడా తెలుపుతుంది. మనకు అతిదగ్గర్లోని కొవిడ్‌ పేషెంట్‌ ఎంత దూరంలో ఉన్నాడో కూడా చెప్పేస్తుంది.

అయితే, సైబర్‌భద్రతా నిపుణులు, సైబర్‌ న్యాయ నిపుణులు మాత్రం గోప్యతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్‌, వ్యక్తి తాలూకు లొకేషన్‌, లింగం, ప్రయాణ వివరాలు తదితర సమాచారాన్ని సేకరించి క్లౌడ్‌లో భద్రపరుస్తుంది. ఆ సమాచార భద్రతపై తమకు సందేహాలున్నాయని, యాప్‌ ఏ మాత్రం పారదర్శకంగా లేదని ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడం లా సెంటర్‌ అనే సంస్థ ఆరోపించింది. ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేసింది.

 

ఐఫోన్‌ వర్షన్‌ : Click Here to Download

 

ఆండ్రాయిడ్‌ వర్షన్‌ : Click Here to download

 

Read more RELATED
Recommended to you

Latest news