తుర్కియే, సిరియాలో భూకంపం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో మొత్తం 9,400 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ దేశంలో మొత్తం 6,957 మంది చనిపోయారని తుర్కియే అధికార యంత్రాంగం ప్రకటించింది. సిరియాలో ఈ సంఖ్య 1,250గా ఉంది. రెండు దేశాల్లో మొత్తం 30వేల మందికిపైగా గాయపడ్డారు. శిథిలాల తవ్వకం ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూలిన భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి.
శిథిలాల కింద చిక్కుకొన్న వారి కోసం వెతుకులాట కొనసాగుతున్నది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తున్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులతో దవాఖానలు నిండిపోయాయి. అక్కడి పరిస్థితి చూస్తుంటే.. ఒళ్లు జలదరిస్తోందని, వైద్య సిబ్బంది అవిశ్రాతంగా పనిచేస్తున్నారని సిరియాకు చెందిన డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ మిషన్ హెడ్ సెబాస్టియన్ పేర్కొన్నారు. జపాన్లో 2011లో సునామీ కారణంగా 20వేల మంది చనిపోయారు. 2015లో నేపాల్లో భూకంపానికి 8,800 మంది బలయ్యారు.