ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అరచకాలతో ప్రజలు విసిగిపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజలు స్వచ్చందంగా పనబాక లక్ష్మీ నామినేషన్లో పాల్గొన్నారన్న అయన ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికను చూడాలని అన్నారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు, ప్రత్యేక హోదా తెస్తామన్నారు, వైసీపీ హామీలను నమ్మి అధికారంలోకి తీసుకువచ్చి మోసపోయాం అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్లమెంట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఎంతసేపు కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
రెండేళ్లలో రాష్ట్రంలో అవినీతితో పాటు ధరలు పెరిగిపోయాయని, మద్యపాన నిషేధం అని చెప్పి సొంత కంపెనీలు పెట్టి నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తున్నారని అన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసి ఇప్పుడు 4వేల కోట్లు దోచుకుంటున్నారన్న ఆయన రాష్ట్రం అన్నివిధాలా నష్టపోయింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని అన్నారు. రాష్ట్ర వైసీపీ ఎంపీలు గొర్రెల మంద, పార్లమెంట్ లో ఏపీ గురించి అసలు మాట్లాడుతున్నారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కంపెనీలు అన్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నాడని అన్నారు.