రాయలసీమ ప్రాంతంలోని బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ ఈ నెల 24న శాసనసభలో చేసిన తీర్మానంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై గిరిజన సంఘం శుక్రవారం మన్యం బంద్‌కు పిలుపునిచ్చింది. ఇప్పటికే బంద్ జయప్రదానికి ఏజెన్సీ అంతటా విస్తృత ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై గ్రామాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. రద్దు చేసిన జిఒ 3 పునరుద్ధరణను మాత్రం రెండున్నరేళ్లుగా ఎందుకు పట్టించుకోవడం లేదని గిరిజనులు తమ ఆగ్రహం వ్యక్తం చెసాతున్నారు. గిరిజన యువతకు ఉద్యోగ నియామకాల్లో నూరు శాతం రిజర్వేషన్ కల్పించిన జిఒ 3కు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదని సమాచారం.
రాయలసీమ ప్రాంతంలోని బిసి – ఎలో ఉన్న బోయ,వాల్మీకిలను ఎస్‌టి హోదాలో చేర్చాలని తీర్మానం చేయడానికి ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు పాటించాల్సివుంది. ఒక తెగనుకానీ, సమూహాలనుగానీ షెడ్యూల్ తెగలుగా గుర్తించేందుకు లోకూర్ కమిటీ కొన్ని ప్రమాణాలను నిర్దేశించడం జరిగింది. ఈ ప్రకారం.. ఆహార సేకరణ, పోడు వ్యవసాయం, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, కళలు, ప్రత్యేక నివాసిత ప్రాంతం, విద్య, ఆరోగ్యం, ఆదాయం, వెనుకబాటుతనం వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శామ్యూల్ ఆనందకుమార్ సిఫార్సుల ప్రకారం తీర్మానం చేసింది తప్ప, తెగను గుర్తించేందుకు లోకూర్ కమిటీ చేసిన సిఫార్సులను గాలికొదిలేసింది.