ఆఫ్ఘనిస్తాన్ పై వరసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. వరసగా మూడు రోజులుగా బాంబు పేలుళ్లతో ఆఫ్ఘన్ దద్దరిల్లుతోంది. ఇటీవల ఓ స్కూల్, షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఓ మసీదులో బాంబు దాడులు జరిగాయి. తాజాగా మరోసారి మసీదులో ప్రజలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో శక్తివంతమైన బాంబు దాడి జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్ లోని కుందుజ్ నగరానికి సమీపంలో ఉన్న మసీదులో ఈ దాడి జరిగింది. బాంబు దాడిలో 33 మంది మరణించారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గతేడాది ఆఫ్ఘన్ పౌర ప్రభుత్వాన్ని గద్దె దింపి తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆదేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడుతోంది. మైనారిటీలే లక్ష్యంగా ఇప్పటికే పలు దాడులకు పాల్పడింది. అయితే ఇన్ని దాడులు జరుగుతున్నా… తాలిబన్ ప్రభుత్వం ఐఎస్ కు అడ్డుకట్ట వేయలేకపోతోంది. మరోవైపు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. ఇండియా వంటి దేశాలు ఆహార ధాన్యాలను అందిస్తే తప్ప అక్కడ ఆకలి కేకలు తగ్గడం లేదు.