ఆప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. షియా ముస్లింలు, విద్యార్ధులు టార్గెట్ గా విధ్వంసానికి తెగబడ్డారు ముష్కరులు. మూడు శక్తివంతమైన పేలుళ్లతో ఒక్కసారి కాబూల్ నగరం ఉలిక్కి పడింది. పశ్చిమ కాబూల్ లోని ఓ హైస్కూల్ లో జరిగిన బాంబుదాడుల్లో అనేక మంది విద్యార్థులుతో పాటు సాధారణ ప్రజలు కూడా చనిపోయారు. ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో మృతుల సంఖ్య 20కి చేరింది. కాబూల్ లోని దాష్ట్-ఏ- బర్చిలోని అబ్ధుల్ రహీమ్ షాహీాద్ హైస్కూల్ లో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల వల్ల అనేక మంది పిల్లలు గాయపడ్డారు. మరింతగా ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది. దాదాపు 1000 మంది విద్యార్థులు ఉండే హైస్కూల్ లో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా పేలుడు సమయంలో ఎంతమంది పిల్లలు పాఠశాలలో ఉన్నారనే దానిపై స్పష్టత రాలేదు. కాగా షియా హజారా తెగకు సంబంధించిన ప్రజలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. వీరిని టార్గెట్ చేస్తూ దాడికి తెగబడ్డారని తెలుస్తోంది. అయితే ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ వెల్లడించలేదు. ఇప్పటి వరకు ఆప్ఘన్లో జరిగిన దాడులన్నీ ఐఎస్ మిలిటెంట్ గ్రూప్ చేసినవే… ప్రస్తుతం ఈ దాడి కూడా ఈ ఉగ్రవాద సంస్థే చేసినట్లు అనుమానిస్తున్నారు.