దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ పేరిట నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆర్మీలో చేపట్టాలనుకుంటున్న పార్ట్ టైం రిక్రూట్మెంట్ వద్దే వద్దని అంటున్నారు యువత. అసలు ఇప్పటిదాకా చేపట్టిన ర్యాలీల సంగతి ఏంటి వాటికి రాత పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు అని నిలదీస్తున్నారు. ఇప్పటిదాకా నిర్వహించిన ఆర్మీ ర్యాలీలకు సంబంధించి ఫిజికల్ టె స్టులు పూర్తయ్యాక, రాత పరీక్షల కోసం సిద్ధం అవుతున్న వారికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటన్నది వారి ఆవేదన. ఇదే సందర్భంలో రాజ్ నాథ్ సింగ్ (కేంద్ర మంత్రి) ఈ పథకంపై వెనక్కు తగ్గేదే లేదని అంటున్నారు. వీలున్నంత వరకూ వయో పరిమితి సడలింపునకు మాత్రంచూస్తున్నారు. గరిష్ట వయో పరిమితి మూడేళ్ల కు పెంచాలని మాత్రం నిర్ణయించారు. శిక్షణ అనంతరం సైన్యంలోకి తీసుకుంటామని, నాల్గేళ్ల కెరియర్ అయిపోయాక వీరికి మళ్లీ పరీక్షలు నిర్వహించి, సంబంధిత భర్తీలో పది శాతం రిజర్వేషన్-ను అనువర్తింపజేస్తామని అంటున్నారు.
దీన్నొక అద్భుత పథకం కిందే కేంద్రం అభివర్ణిస్తోంది.నాలుగేళ్ల తరువాత ఒక్కో అభ్యర్థికి 11.7 రూపాయలు అందుతాయని కూడా చెబుతోంది. అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్, రక్షణశాఖల్లో పోస్టుల భర్తీ సమయంలో పది శాతం రిజర్వేషన్ ను తప్పక అమలు చేస్తామని అంటున్నారు. రక్షణ శాఖ పరిధిలో ఉన్న 16 ప్రభుత్వ రంగ శాఖల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు (అగ్నివీర్ నియామకంలో భాగంగా వచ్చిన వారికి) వర్తింపు జేస్తామని అంటున్నారు. వీటితో పాటు సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్స్, అసోం రైఫిల్స్ లో కూడా వీరికి ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు.
ఇవన్నీ కేంద్రం ఓ వైపు చెబుతుంటే అస్సలు తమకు అగ్నివీర్ వద్దేవద్దని ఆందోళన చేస్తున్న యువత మొండికేస్తుంది. అదేవిధంగా విపక్షాలు కూడా దీన్నొక అస్త్రంగా భావిస్తూ తమ రాజకీయం కొనసాగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, హరియాణా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాలలో నిన్నటి వేళ కూడా నిరసనలు కొనసాగాయి. అయితే రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు కేవలం మొసలి కన్నీరు కారుస్తున్నాయా లేదా నిజం గానే ఈ పథకంపై వీరికి వ్యతిరేకత ఉన్నదా అన్నది మాత్రం తేలడం లేదని కమలనాథుటు అంటున్నారు.