కరోనా కష్ట సమయంలో టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇప్పటికే జియో ఫోన్ లను వాడుతున్న వినియోగదారులకు రెండు ఆఫర్లను ప్రకటించిన విషయం విదితమే. జియో ఫోన్ యూజర్లకు రోజుకు 10 నిమిషాల చొప్పున నెలకు 300 నిమిషాలను ఉచితంగా అందిస్తున్నామని, వారు ఏదైనా ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే అంతే మొత్తంలో బెనిఫిట్స్‌ను ఉచితంగా అందిస్తున్నామని జియో ప్రకటించింది. ఇక టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా ఇలాగే ఆఫర్లను అందిస్తోంది.
టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ దేశంలోని తక్కువ ఆదాయం కలిగిన పేదలు 5.50 కోట్ల మందికి రూ.49 ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపింది. ఇందులో కస్టమర్లకు రూ.38 టాక్‌టైం, 100 ఎంబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. ఈ ప్లాన్ ఆయా వినియోగదారులకు ఉచితంగానే లభిస్తుంది. అయితే దీన్ని ఎవరెవరికి ఇస్తారు, తక్కువ ఆదాయం ఉన్నవారిని ఎలా నిర్ణయిస్తారు ? అన్న వివరాలను ఎయిర్టెల్ ప్రకటించలేదు. మరో రెండు, మూడు రోజుల్లో ఆ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఇక ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.79 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే అంతే మొత్తం విలువైన బెనిఫిట్స్ ఉచితంగా లభిస్తాయి. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఈ ఆఫర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎయిర్ టెల్ తెలిపింది. దీని వల్ల తమ సంస్థకు రూ.270 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించింది.