రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నాయనే వార్తలపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలో కలవాల్సిందే. అవి ఎండిపోతే తప్ప’ అని వైఎస్ షర్మిల బదులిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఆమె అన్నారు .మరణించిన వైఎస్ఆర్ కి రాజకీయాలు ముడిపెట్టవద్దని, ఆయన విగ్రహాలను ధ్వంసం చేయవద్దని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు సపోర్ట్ వల్లే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల కోరారు. పోలవరంపై శ్వేతపత్రం, కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులపై బ్లూప్రింట్ రిలీజ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలు ఓట్లతో ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయినా మేం పోరాడుతాం. మాకు మంచి భవిష్యత్తు ఉంది’ అని వైఎస్ షర్మిల అన్నారు.