ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టులు వరదతో పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా పెరిగిందని, ప్రమాద స్థాయికి చేరుకుందనే వార్తలు వచ్చాయి. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని, అధికారులు దాదాపు 17 గేట్లు ఎత్తి వేసి.. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేసినట్లు తెలిపారు. అయితే అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండటంతో కడెం ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది.
అయితే, కట్ట పైనుంచి నీరు ప్రవహించడంతో ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందనే వార్తలు ఇటీవల ఆందోళనకు గురి చేశాయి. అయితే ఈ విషయంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. కడెం ప్రాజెక్ట్ కట్ట తెగిపోతుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పడేశారు. ఈ విషయంపై కడెం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులకు ఎలాంటి సమాచారం తెలియదన్నారు. వరద ఉధృతి కొనసాగుతోందని, పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు.. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ప్రవహం తగ్గేంతవరకు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలన్నారు.