కోటి జన్మలెత్తిన టీడీపీ(TDP)కి మంగళగిరిలో విజయం సాధ్యపడదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి ఐబీఎన్ భవన్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన మీద అవినీతి అక్రమాలు వెలువడిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నట్లు ఆళ్ళ చెప్పారు. తన రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని అన్నారు. 2006లో తను రాంకీ సంస్థలో ఉద్యోగం చేసానని… 2006 నుండి 2021 వరకు రాంకీ గ్రూప్ లో ఏ విధమైన షేర్లు లేవని… అది రాంకీ గ్రూప్ సంస్థ లో జరిగిన ఐటీ దాడుల్లో కూడా రుజువు అయ్యిందన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన నగదు తన వద్ద నిబంధనల మేరకే ఉందనే విషయాన్ని గుర్తు చేసారు. స్థానిక టీడీపీ నాయకులు ఒక కంపెనీ, షేర్లు, మూలధనం అంటే ఏమిటో తెలుసుకొని అవగాహనతో మాట్లాడాలని సూచించారు.
దుగ్గిరాల మండలంలో ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందన్న మాట అవాస్తవమని, టీడీపీ నాయకులు దీన్ని బూచిగా చూపడం కరెక్ట్ కాదని ఆళ్ళ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. లోకేష్ పై తను ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలిచానని.. తనకు స్థానిక ప్రజలు అంతటి విజయాన్ని చేకూర్చారన్నారు. స్థానిక టీడీపీ నాయకులు ఇది తెలుసుకోవాలని.. కోటి జన్మలెత్తిన టీడీపీకి మంగళగిరిలో విజయం సాధ్యపడదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం పుష్కరాల పేరుతో తాడేపల్లిలో 2000 నివాసాలను తొలగించిందన్న ఆర్కే… చంద్రబాబు వారికి ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం చేయలేదని విమర్శించారు.