అల్లు అరవింద్ కి కరోనా.. కానీ ?

టాలీవుడ్ లీడింగ్ నిర్మాత అల్లు అరవింద్ కు కరోనా సోకిందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపధ్యంలో ఈరోజు అల్లు అరవింద్ దానికి సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. అందరూ ప్రచారం చేస్తున్నట్టుగా తనకు వాక్సిన్ రెండు డోసులు వేసిన తర్వాత కరోనా రాలేదని మొదటి డోస్ మాత్రమే వేసుకున్నానని అన్నారు. తాను మరో ఇద్దరు మిత్రులతో కలిసి వెకేషన్ కి వెళ్ళానని చెప్పుకొచ్చారు. తిరిగి వచ్చాక తమకు కరోనా సోకిందని ఆయన పేర్కొన్నారు.

అయితే తనకు, మరో స్నేహితుడికి రెండు రోజుల పాటు కొద్దిపాటి జ్వరం వచ్చిందని, మూడో స్నేహితుడు మాత్రం హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని అరవింద్ పేర్కొన్నారు. తాను, తన స్నేహితుడు వాక్సిన్ వేయించుకున్నామని, హాస్పిటల్ లో చేరిన స్నేహితుడు మాత్రం వాక్సిన్ వేయించుకోలేదని అరవింద్ తెలిపారు. వాక్సిన్ వేయించుకున్న కారణంగానే తామిద్దరం జ్వరంతో బయటపడ్డా ఆయన హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చిందని అన్నారు. అందుకే అందరూ వాక్సిన్ వేయించుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. వాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా వస్తుందనే ప్రచారానికి తనకు జరిగిన అంశాన్నే ఉదాహరణగా తీసుకోవాలని ఆయన అన్నారు.