కేవలం 13 నెలల వ్యవధిలోనే ఒలింపిక్స్‌లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం, డైమండ్ లీగ్‌లో ట్రోఫీ సాధించి ఓ స్టార్ అథ్లెట్‌కు ఎంత నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ఫిట్‌నెస్ ఉండాలో చాటి చెప్పాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. స్విట్జర్లాండ్‌లోని డైమండ్ లీగ్ ఫైనల్స్‌ను గెలిచిన తొలి భారతీయ జావెలిన్ త్రో ఆటగాడిగా టోక్యో ఒలింపిక్స్ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు.
ఇది ఇలా ఉండగా, నీరజ్ చోప్రా ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ ఈవెంట్ లో తలుక్కున మెరిశాడు. ఢిల్లీ వేదికగా సిఎన్ఎన్ న్యూస్-18 ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఈవెంట్ లో నీరజ్ చోప్రాతో పాటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ సహా మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అల్లు అర్జున్ ఇండియా సినిమా పుష్ప: ది రైజ్ సినిమాకు “ఇండియన్ ఆఫ్ ది ఇయర్” అవార్డు అందుకోగా, ఆ తర్వాత క్రీడా విభాగంలో నీరజ్ చోప్రా ఈ అవార్డు తీసుకున్నాడు. నీరజ్ చోప్రా, అల్లు అర్జున్ లు ఒకే వేదికను పంచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చిన అనంతరం తనివి తీరా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రా, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘తగ్గేదేలే’ మేనరిజం ను చేసి చూపించాడు.