దాదాపు నెల రోజుల నుంచి అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా వారికి అన్ని విధాలుగా మద్దతు వస్తుంది. తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలుస్తూ పోరాటానికి తమ వంతు సహకారం అందిస్తుంది. నెల రోజుల నుంచి అనేక రూపాల్లో అమరావతి రైతులు తమ నిరసనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతుల కోసం పలువురు ముందుకి వస్తున్నారు. అయితే టాలివుడ్ నుంచి మాత్రం అవసరమైన మద్దతు లభించడం లేదు. దీనితో తెలుగు సిని పరిశ్రమ మీద అక్కడి రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలో 24 రోజులుగా పోరాటం చేస్తున్న రైతులకు అండగా నారా రోహిత్ ముందుకి వచ్చారు. వారికి మద్దతుగా తన సోషల్ మీడియా ఖాతాలో రోహిత్ ఒక పోస్ట్ పెట్టారు.
“ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను.” అని పోస్ట్ చేసారు.