ఏ పార్టీకైనా నాయకులే కాదు.. ఎమ్మెల్యేలు చాలా ముఖ్యం. వారు వేసే ప్రతి అడుగు ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపించేవారికి చాలా కీలకం. ఒకవేళ సదరు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. ఎమ్మెల్యేల నడవడిక చాలా ముఖ్యం. ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలను బట్టే సదరు పార్టీలపై ఒక ఇంప్రెషన్ పడుతుంది. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేల వైఖరి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఒక్కొక్క ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరు.. ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేస్తోంది. ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులతో సీఎం జగన్ ఇరుకునపడుతున్నారని చెబుతున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం అమరావతి ఉద్యమం జోరుగా ఉంది. అక్కడి ప్రజలు జగన్‌పైనా. ప్రభుత్వంపైనా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జగన్‌పై ఒత్తిడి కూడా పెంచుతున్నారు. ఇక, కౌలు పోగొట్టుకున్న రైతులకు కౌలు ఇస్తామన్న చంద్రబాబు హామీని కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వారు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే, ప్రభుత్వం ఇటీవల కౌలు విడుదల చేసింది. కొందరి పడ్డాయి. మరికొందరు రైతులు వెయిటింగ్లో ఉన్నారు.
ఇలా.. కౌలు వెయిటింగ్లో పడిన వారిలో దళిత వర్గానికి చెందిన రైతులు ఎక్కువగా ఉండడంతో వారు మరోసారి జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే అయిన ఉండవల్లి శ్రీదేవి.. ఎంత సంయమనంతో వ్యవహరించాలి? ప్రభుత్వంపై తన చర్యల ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి? కానీ, ఆమె దుందుడుకుగా వ్యవహరించారు. కౌలు వేశారనే కారణాన్ని చూపిస్తూ.. జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే ఆమె జగన్ చిత్రపటానికి, ఆయన తండ్రి వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామం మరింతగా అక్కడి ప్రజలను రెచ్చగొట్టింది. ఆమె చేసిన పనికారణంగా జగన్‌పై మరోసారి అక్కడి వారు విరుచుకుపడేలా చేసింది. మరి ఇలాంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన అవసరం లేదా? అని పార్టీలోనే చర్చ నడుస్తోంది.