ఆంధ్రప్రదేశ్ అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు కోర్టుదాకా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఐతే ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటివి ఎక్కడ కనిపించలేదని కోర్టు తీర్పు వచ్చింది. తాజాగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం సాంకేతికంగా అభ్యంతరకరం అయితే మరో కోణంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని, అందువల్ల దర్యాప్తుని ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు.
విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని వస్తుందంటే ఎవరైనా 20కిలోమీటర్ల లోపల దారి లేని గ్రామాల్లో భూములు కొన్నారంటే అర్థమేంటని ప్రశ్నించారు. అమరావతి ఓ కుంభకోణమని, అందులో ఎవరెవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, అది అందరికీ తెలుసని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు సాంకేతిక అంశాల మీద ఆధారపడి ఉందని, ఆ విధంగానే కోర్టు తీర్పు వచ్చిందని తెలిపారు.