అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ మేరకు అమరావతి పరిరక్షణ సమితి లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. రైతుల తరఫున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించనున్నారు.
అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని ప్రాంత రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మార్గమధ్యంలో పలు చోట్ల వారికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వైకాపా శ్రేణులు పాదయాత్రకు అడ్డుతగులుతూ మహిళలు, రైతులపై దాడులకు పాల్పడుతున్నారు.
ఇటీవల రాజమహేంద్రవరంలో రాళ్లు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అడ్డంకులు ఎదురవకుండా చూడాలని హైకోర్టులో రైతుల తరఫున అమరావతి పరిరక్షణ సమితి లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.