టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. పుంగనూరులో జరిగిన పరిణామాలు అధికార పార్టీ హింసా ప్రవృత్తిని చాటేలా ఉన్నాయని విమర్శించారు పవన్. మరోవైపు, టీడీపీ కార్యకర్తలే పోలీసులపై దాడి చేసి, వారిని గాయపరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పుంగనూరు ఘటనల్లో చంద్రబాబుకు, టీడీపీకి మద్దతుగా పవన్ వ్యాఖ్యలు చేయడాన్ని అంబటి ఖండించారు. “కానిస్టేబుల్ కొడుకువై ఉండి, పోలీసులను గాయపరిచిన దౌర్జన్యకారులను బలపరుస్తావా బ్రో!” అంటూ పవన్ ను అంబటి ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాయలసీమకు ద్రోహం చేశారని దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు పుంగనూరుకు వెళ్లారని, అక్కడ హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణమన్నారు. పుంగనూరు బైపాస్ నుండి వెళ్తామని చెప్పిన టీడీపీ ఆ తర్వాత పుంగనూరులోకి వచ్చే ప్రయత్నం చేసిందన్నారు. దీంతో పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ కేడర్ రాళ్లు, బీరు బాటిల్స్‌తో దాడి చేసిందన్నారు.