ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల చేశారు అంబటి రాంబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుకున్న విధంగానే జూన్ 1న నీటిని విడుదల చేశామన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే విపత్తులకు ముందుగానే నీటిని ఇవ్వడానికి సిద్ధం చేశామన్నారు. నారుమళ్లు వేసుకోవడానికి రైతులకు వీలుగా ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బతిన్నదో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమ లతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు అంబటి రాంబాబు. ఇంజనీర్లు, మేధావులు, మీడియాతో చర్చ జరగాలన్నారు.
కాపర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్లే వరదలకు దెబ్బతిన్నదని అన్నారు. కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం చారిత్రక తప్పిదం అన్నారు. డయాఫ్రం వాల్ ని కొనసాగించాలా? లేక కొత్తది నిర్మించాలో అనే దానిపై దేశంలో ఉన్న మేధావులు తలపట్టుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నారు అంబటి. ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తవుతుందన్నారు. మొదటి దశ పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళతామన్న చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది అని అడిగే అర్హత టీడీపీకి నేతలకు లేదన్నారు.