ఉత్తర కొరియా నియంత కిమ్ అగ్రరాజ్యానికి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన నార్త్ కొరియా.. ఓ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షిపణిని సైతం పరీక్షించినట్లు అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ఉన్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి ఇప్పుడు అమెరికా మొత్తం తమ లక్షిత ప్రాంతంలోకి వచ్చినట్లేనని, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంపైన అయినా తమ ప్రాంతం నుంచే దాడి చేయగలమని హెచ్చరికలు పంపారు.
ఈ క్రమంలోనే తాజాగా అమెరికా చేసిన పనిని కిమ్ తప్పుబట్టారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉక్రెయిన్‌కు 8 బిలియన్ డాలర్ల సైనిక సాయం ప్రకటించడంపై కిమ్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయంలో అమెరికా పెద్ద తప్పు చేసిందన్నారు. ఇది నిప్పుతో చెలగాటం లాంటిదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంఘర్షణను వాషింగ్టన్ తీవ్రతరం చేస్తోందని, ఐరోపా మొత్తాన్ని అణు యుద్ధం అంచునకు నడిపిస్తోందని దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. రష్యా హెచ్చరికలను తక్కువగా అంచనా వేయొద్దని సూచించారు.