అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్. వాసుదేవరెడ్డి ఆర్.నలిపిరెడ్డి ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఎన్నారై మెడికల్ అఫైర్స్ అడ్వైజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు చిన్నపిల్లల జబ్బుల నివారణకు డాక్టర్ వాసుదేవ రెడ్డి కృషి చేయనున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతభత్యాలు ఆశించకుండా పని చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. వాసుదేవ రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బుచ్చిరెడ్డి కండ్రి గ్రామం. సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు వాసుదేవరెడ్డి. అనంతరం అమెరికా వెళ్లి మెల్బోర్న్ (ఫ్లోరిడా రాష్ట్రం)లో వైద్యుడిగా స్థిరపడ్డారు. గత 22 ఏళ్లుగా ఎండి ఫ్యామిలీ మెడిసిన్, ఎమ్మెస్ పబ్లిక్ హెల్త్ నిపుణులుగా సేవలు అందిస్తున్నారు.
తనపై నమ్మకంతో సలహాదారుగా నియమించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించడమే లక్ష్యంగా.. అమెరికాలో అమలవుతున్న అత్యంత అదునాతనమైన వైద్య సేవలు, టెలిమెడిసిన్ రంగం ఆంధ్రప్రదేశ్ కు చేరువయ్యేలా పని చేస్తామని అన్నారు.