అంచనాలకు తగ్గట్టే ‘చేవెళ్ల విజయ సంకల్ప సభ’లో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలా వద్దా?.. ఢిల్లీలోని ప్రధాని మోదీకి వినపడేలా ప్రజలు నినాదించాలని అని అమిత్‌షా పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అవుతోందని, పేపర్ లీకేజీలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్పందించలేదని తప్పుబట్టారు. పేపర్ లీక్ ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. వాటిని ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. ఒవైసీ అజెండాపై సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్న అమిత్ షా.. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. మజ్లిస్ అంటే తమకు భయం లేదని చెప్పారు. కాంగ్రెస్ తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అమిత్ షా ఆరోపించారు.