బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్.. లంచగొండి రాష్ట్ర సమితి : అమిత్‌ షా

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొని మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. ఓరుగల్లు కాకతీయుల రాజధాని… ఇలాంటి గడ్డపై అందరికీ నమస్కరిస్తూ సభను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భద్రకాళీ దేవాలయం, వెయ్యి స్తంభాల గుడి, మల్లన్న దేవాలయం, రామప్ప దేవాలయం, కొలనుపాక జైనమందిరం… ఇవన్నీ తెలంగాణ వారసత్వానికి ప్రతీక అన్నారు.

Amit Shah's speech a pack of lies: TRS

మీరు వేసే ఓటు భారత ప్రజల భవిష్యత్తును, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. సర్‌ప్లస్‌లో ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ లంచగొండి సమితి అన్నారు. మియాపూర్ భూముల కుంభకోణంలో రూ.4వేల కోట్ల దోపిడీ జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద కుంభకోణం జరిగిందన్నారు. మిషన్ కాకతీయలో రూ.22వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు చెప్పడానికి వారం రోజులు కూడా సరిపోదన్నారు. తెలంగాణలో మద్యాన్ని వరదగా పారిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం బుజ్జగింపు చర్యలకు, సంతుష్టీకరణ చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన దినాన్ని కూడా నిర్వహించడం లేదన్నారు. మతోన్మాద రాజకీయంతో మజ్లిస్ పార్టీకి తలొగ్గిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని హైదరాబాద్… భారత్‌లో కలిసిందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఓవైసీ ఒత్తిడికి లొంగి కేసీఆర్… రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. భద్రాచలం శ్రీరాములవారికి సమర్పించాల్సిన పట్టువస్త్రాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించడం లేదన్నారు. బీఆర్ఎస్ గుర్తు కారు అని.. కానీ ఈ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు.

ప్రభుత్వాన్ని ఓవైసీ నడిపిస్తున్నారన్నారు. కేసీఆర్ యువతకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రవళిక వంటి యువత ఆత్మహత్యలు జరగకుండా చూస్తామన్నారు. అత్యంత అవినీతిమయ ప్రభుత్వం కేసీఆర్‌దే అన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఉమ్మడి ఏపీకి రూ.2 లక్షల కోట్లు ఇస్తే, మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. దీనిని ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రిని పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎంజీఎంకు రూ.1000 కోట్లు ఇస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news