బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా.. మోడీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి పెద్దపీట వేశారు. ధరణి స్థానంలో మీ భూమి యాప్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, వరి క్వింటాలుకు రూ.3100 మద్దరు ధర, నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, ప్రతీ ఐదేళ్లకోసారి ఉద్యోగులకు పీఆర్సీ, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి 10 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు 10 అంశాల కార్యాచరణను ఈ మేనిఫెస్టో ద్వారా ప్రకటించింది. మోడీ ఆలోచనను ప్రతిబింబించేలా సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్, మహిళా సాధికారత, పేద, బడుగు బలహీనవర్గాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించారు. వీటితో పాటు కొత్త రేషన్ దారులకు మేనిఫెస్టోలో శుభవార్త చెప్పారు. అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ మ్యానిఫెస్టోలోని హైలైట్స్..
1. ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి
2. వెనుకబడిన వర్గాల సాధికారత – అందరికీ చట్టం సమానంగా వర్తింపు
3. కూడు-గూడు: ఆహార, నివాస భద్రత
4. రైతే రాజు – అన్నదాతలకు అందలం
5. నారీశక్తి – మహిళల నేతృత్వంలో అభివృద్ధి
6. యువశక్తి – ఉపాధి
7. విద్యాశ్రీ – నాణ్యమైన విద్య
8. వైద్యశ్రీ – నాణ్యమైన వైద్య సంరక్షణ
9. సంపూర్ణ వికాసం – పరిశ్రమలు, మౌలికవసతులు, ఇతర సౌకర్యాలు
10. వారసత్వం, సంస్కృతి, చరిత్ర