తెలంగాణలో ఎన్నికల సమర భేరి మోగించేందుకు బీజేపీ సన్నద్ధమైంది. రేపు ఖమ్మంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా రేపు ఖమ్మం జిల్లాలో పాల్గొనే బహిరంగ సభకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, రేపు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా చేరుకుని.. అక్కడ నుంచి హెలికాప్టర్ లో 2.10 గంటలకు కొత్తగూడెం చేరుకుని.. రోడ్డు మార్గంలో భద్రాచలంకు అమిత్ షా వెళ్తారు. 2.25 నుంచి 2.40 వరకు సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరిగి భద్రాచలం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెం వెళ్లి.. అక్కడి నుంచి 2.55 కు బీఎస్ఎఫ్ హెలికాప్టర్ లో బయలుదేరి 3.30కు ఖమ్మంకు చేరుకుంటారు.
ఇక, మధ్యాహ్నం 3.45 నుంచి 4.35 వరకు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే.. వ్యవసాయ రంగానికి, రైతులకు ఏమీ చేస్తారో ఆయన ప్రకటించనున్నారు. రైతు పాలసీనీ ఇప్పటికే బీజేపీ రూపొందించింది. అయితే, బీజేపీ నిర్వహిస్తున్న ఈ సభలో చేరికలు ఉంటాయని పలువురు కమలం నేతలు అంటున్నారు. బహిరంగ సభ తర్వాత బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. ఎన్నికల స్ట్రాటజీపై చర్చించి.. పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. బస్సు యాత్రల తేదీలను షా ఖరారు చేయనున్నారు. ఇక తిరిగి సాయంత్రం 5.45గంటలకు హెలికాప్టర్ లో గన్నవరం చేరుకుంటారు.. అక్కడి నుంచి సాయంత్రం 6.25 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే, అమిత్ షా పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన రేపు బహిరంగ సభలో ఎలాంటి సమస్యలైపై ప్రసంగించనున్నారు అనేది వేచి చూడాలి..