ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కమలం పార్టీ జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం ఒక్కరోజు ముందే అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు అమిత్ షా పర్యటన షెడ్యూల్‌ను బీజేపీ వర్గాలు విడుదల చేశాయి.16వ తేదీన రాత్రి 7.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఆర్పీఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకోనుండా.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇక 17న ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.