పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంపిణీకి ఇవాల్టితో ముగిసిన గడువును సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల కొత్తగా 2 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పంపిణీ గడువును పొడిగించింది. ఇప్పటివరకు పెన్షన్ల పంపిణీ పూర్తి కాగా.. మిగతా వారికి కూడా ఎల్లుండిలోగా పంపిణీ చేయాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 31న పించన్ సొమ్ము కాజేసిన సంఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నక్కపల్లి మండలం జానకయ్యపేట సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ నాని బాబుని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. నక్కపల్లి మండలం జానకయ్య పేట సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా అలజంగి నాని బాబు పనిచేస్తున్నారు.
దోపిడీలో తనతోపాటు గాజువాక ప్రాంతానికి చెందిన స్నేహితులు దేవిరెడ్డి సాయికుమార్, చందకసాయి, ఎలియాస్ స్టీఫిన్‌తో కలసి దారి దోపిడీకి పాల్పడి రూ. 13.78 లక్షల పెన్షన్ సొమ్ము కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.12.92 లక్షల పెన్షన్ సొమ్ము రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు పురోగతి సాధించడంలో పనిచేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ప్రశంస పత్రాలను అందజేశారు.