ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వారం రోజులుగా వేట సాగిస్తున్నారు. పకడ్బందీ నిఘా నుంచి కూడా అమృత్ పాల్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకుపోయిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకరకాల వేషాల్లో వివిధ వాహనాల్లో తిరుగుతున్నట్లుగా సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు దొరికాయి. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ నేర చరిత్రపై ఫోకస్ చేసిన పంజాబ్ పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి.
గత వారం రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అమృత్ పాల్.. బ్రిటన్ పౌరసత్వం కోసం ప్రయత్నించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో సిక్కు వర్గం విశ్వాసాన్ని కోల్పోయినందున, భారత్ నుంచి పారిపోయి యూకేలో తలదాచుకోవాలనుకున్నాడని తెలుస్తోంది. అతడి భార్య కిరణ్ దీప్ కౌర్ బ్రిటన్ పౌరురాలు కావడంతో, ఆమె ద్వారా అమృత్‌పాల్ సింగ్ ఫిబ్రవరిలోనే ఆ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేశాడు. అయితే అతని దరఖాస్తు బ్రిటీష్ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది.