తిరుపతి కొండ ఎక్కలేని సీఎంకు..గీత కార్మికుల బాధలేం తెలుస్తాయి? అని నిలదీశారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని. నూతన కల్లుగీత పాలసీతో గీత కార్మికులకు ఒరిగేది శూన్యమని.. తాటిచెట్టుకు, ఈత చెట్టుకు తేడా తెలియనివారు పాలసీ రూపొందించారని వెల్లడించారు. తిరుపతి కొండ కాలినడకన ఎక్కలేని సీఎంకు తాటిచెట్టు ఎక్కే గీత కార్మికుల బాధలేం తెలుస్తాయి? జగన్.. తన జే బ్రాండ్ మద్యాన్ని విక్రయించుకునేందుకు లక్షలాది మంది కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహించారు.
2 లక్షల మందికి పైగా గీత కార్మికులు వృత్తిపై ఉంటే 95 వేల మంది మాత్రమే ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గీత కార్మికులకన్నా మద్యం అమ్మకాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యమన్న విషయం పాలసీతో స్పష్టమైందని తెలిపారు. కల్లుగీత సంఘాలు కార్మికులతో చర్చించకుండా పాలసీని ఏకపక్షంగా ఏవిధంగా ప్రకటిస్తారు? అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని. బీమా పథకాన్ని గీత కార్మికులకు టీడీపీ ఎప్పటి నుంచో అమలు చేస్తూ వచ్చింది. మూడున్నరేళ్లలో 47 మంది గీత కార్మికులు మరణిస్తే ప్రభుత్వం 10 శాతం మందికి కూడా సాయం చేయని విషయం నిజం కాదా? అని పేర్కొన్నారు. ఈ పాలసీని వెంటనే రద్దు చేసి గీత కార్మికులకు ప్రయోజనం కలిగేలా నూతన పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని.