భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. అతి పిన్న వయస్సులోనే చదరంగంలో చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ రన్నరప్ గా నిలిచాడు. ఫైనల్ లో కార్ల్‌సన్ చేతిలో ఓడినప్పటికీ.. భారతీయులు గర్వపడేలా చేశాడు ఈ తమిళనాడు కుర్రాడు. అయితే.. ఈ క్రమంలోనే మహీంద్రా & మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ప్రజ్ఞానంద అద్భుతమైన ఆట తీరును మెచ్చుకుంటూ ఈ నెల 24న ట్వీట్ చేశారు.
అయితే ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా తన ప్రశంసలను అంతటితో ఆపేయలేదు. 18 ఏళ్ల వయసుకే చెస్ వరల్డ్‌కప్ ఆడి ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పిన ప్రజ్ఞానందకు అద్దిరిపోయే బహుమతి ఇచ్చాడు. నిజం చెప్పుకోవాలంటే ఆ బహుమతి ప్రజ్ఞానందకు కాదు, అలాంటి యువ తేజాన్ని దేశానికి అందించిన అతని తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా ఇచ్చారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటంటే.. Mahindra XUV400 EV.
అవును, ఆర్థిక పరిస్థితులను సవాల్ చేస్తూ తమ కొడుకుకు 10 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్, 12 ఏళ్లకు గ్రాండ్‌మాస్టర్ అయ్యేలా ప్రోత్సహించిన నాగలక్ష్మి-రమేష్ బాబు దంపతులకు ఆనంద్ మహీంద్ర ఎలక్ట్రీక్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా కూడా మారింది.
అయితే ఈ నెల 25న ఆంటే ఆదివారం ప్రజ్ఞానంద తన తల్లి నాగలక్ష్మితో ఉన్న ఫోటోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసి ‘అమ్మా, నీకు వందనాలు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన క్రిష్లే అనే ఓ నెటిజన్ ‘అతను మహీంద్రా థార్ పొందేందుకు అర్హుడు’ అంటూ కామెంట్ చేశాడు. దీన్ని గమనించిన మహీంద్రా ప్రజ్ఞానందకు కాకుండా, అతని తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కార్
ఇవ్వాలనుకుంటున్నట్లుగా రిప్లై ఇచ్చాడు. నెటిజన్ క్రిష్లే కామెంట్‌పై ఆనంద్ మహీంద్రా ‘క్రిష్లే, ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని నాకు సలహా ఇచ్చిన మీ ఆలోచన బాగుంది. కానీ నాకు మరో ఆలోచన ఉంది. తమ పిల్లలకు చెస్ వంటి ఆటల్లోకి పంపేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. ప్రజ్ఞానందకు చెస్ ఆట ఆడడంలో మద్ధతుగా నిలిచిన అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి-రమేష్ బాబు దంపతులకు XUV400 EV ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు మా కృతజ్ఞతకు అర్హులు’ అంటూ పేర్కొన్నారు.