సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ.. సర్వేపల్లిలో మందు పంపిణీ

నెల్లూరు: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా మందు పంపిణీ  చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే అందుకు ప్రభుత్వ సహకారం కావాలని, అంతమొత్తంలో మందు తయారు చేసేందుకు చేయూత ఇవ్వాలని కోరారు.  కరోనా మందు తయారీ, ఔషధ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని జగన్‌ను ఆనందయ్య లేఖలో కోరారు. ప్రస్తుతం ఒక్కో జిల్లాకి అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా పంపిణీ‌ చేయించాలని కోరారు. భారీ మొత్తంలో మందు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తామని చెప్పారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

ఇక ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు సర్వేపల్లి నియోకవర్గంలో ఇంటింటికి పంపిణీ జరుగుతోంది. మనుబోలు, పొదలకూరు మండలాల్లో గ్రామ వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని లక్ష ఎనభై వేల ఇళ్లకు ఆనందయ్య మందు చేరనుంది. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సోమవారం ఆనందయ్య అందించే కె మందు పంపిణీకి సైతం హైకోర్టు అనుమతి ఇచ్చింది.