ఒక్కచాన్స్ ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఓటేసిన వారిని కాటేసారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కురుపాం ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. మోసపు వాగ్ధానాలతో జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దళిత, గిరిజనులకు మోసం చేసిన వ్యక్తికి ఓటు వేయవద్దని కోరారు. కూటమి అధికారంలోకి రాగానే జీవో నంబర్ 3ను పునురుద్ధరించి స్థానికులకే ఉద్యోగాలిస్తామని పునరుద్ఘాటించారు.
వైఎస్ జగన్ క్యాన్సర్ గడ్డలాంటివారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగిపోయాయని, తాము అధికారంలోకి రాగానే దాడులను అరికడతామని అన్నారు. విజయవాడలో నరేంద్ర మోదీ రోడ్ షో ను చూసి అధికార వైసీపీ కాడ ఎత్తివేసిందని విమర్శించారు. రెండు వందల రూపాయలున్న పింఛన్లను రెండువేలకు టీడీపీ పెంచిందని, రాబోయే రోజుల్లో ఏప్రిల్ నుంచే రూ.4 వేలు పింఛన్లు అందజేస్తామని ప్రకటించారు. రైతుల పాస్ పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు వేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా భూములను లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు.