– ఏపీ సర్కారుపై ప్రతిపక్షాల ఆగ్రహం.. భోగి మంటల్లో విద్యుత్ సంస్కరణల జీవోలు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయానికి అందించే విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలనే నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులపై ఆర్థికంగా అధిక భారం పడుతుందని ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (సీపీఐఏం) పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశాయి.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించడాన్ని నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతలు, రాష్ట్ర మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు తాజాగా వ్యవసాయ కరెంట్ కనెక్షన్లకు సంబంధించిన ప్రభుత్వ జీవోలను దహనం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకువస్తున్న ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర రైతులపై పెద్దమొత్తంలో విద్యుత్ బిల్లుల భారం పడుతుందని వారు పేర్కొన్నారు. సునీతతో పాటు ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్, టీడీపీ కార్యర్తలు కలిసి వెంకటాపురంలో భోగి మంటలు వేశారు. ఈ మంటల్లో ప్రభుత్వ జీవోలను వేశారు. అనంతరం మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు.