చిరంజీవికి అరుదైన గౌరవం.. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం

చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ఆహ్వానం పంపింది. గతంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన చిరంజీవికి ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. భీమవరంలో జూలై 4న నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననుండగా… ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని చిరంజీవికి కిషన్ రెడ్డి లేఖ ద్వారా కోరారు.

ఆజాదీ అమృత్ మహోత్సవము లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను భీమవరంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చిరంజీవికి రాసిన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. తదనంతర పరిస్థితుల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రి గాను ఆయన పని చేశారు.