అచ్చెన్న బరువవుతారా ? బరువు దించుతారా ?

-

టిడిపి అధినేత చంద్రబాబుకు ఇప్పుడున్న పార్టీ నాయకుల్లో అత్యంత సన్నిహితుడు, నమ్మకమైన నాయకుడు, ఎవరైనా ఉన్నారా అంటే అది మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడే. వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు వరకు అచ్చెన్న అంటే బాబు కు పెద్దగా నమ్మకం ఏమి లేదు. ఆయన మంత్రిగా పనిచేసినా, కేవలం అంతవరకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు. అచ్చెన్న దూకుడుగా ఉంటారని, ఎవరి మాట లెక్కచేయరని, అచ్చెన్న సొంత జిల్లా శ్రీకాకుళం లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఎవరి మాట వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని, ఇలా అనేక ఫిర్యాదులు అందడం వంటి కారణాలతో ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్టుగానే వ్యవహరించేవారు.
కానీ 2019 ఎన్నికల తర్వాత టిడిపి ఘోరపరాజయం చెందడంతో చంద్రబాబు ఒంటరిగా మిగిలిపోయారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం పై పోరాడేందుకు బాబు బలం సరిపోయేది కాదు. ఆ సమయంలో  బాబు కి అచ్చెన్న అండగా నిలబడడం,  జగన్ ను ఢీ కొట్టడం, వైసిపి ప్రభుత్వం లోని లోపాలను ఎండగట్టడం ఇలా అన్ని విషయాల లోనూ అచ్చెన్న తనను తాను  నిరూపించుకుని బాబు కి దగ్గరయ్యారు. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఆయన నియమిస్తే తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుంది అనే  అభిప్రాయంలో ఉండడంతోనే ఈ నెల 27వ తేదీన ఆయనకు టీడీపీ ఏపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు బాబు సిద్ధమవుతున్నారు.
అయితే అచ్చెన్న ను ఏపీ టీడీపీ అధ్యక్షుడు గా నియమించడం ద్వారా, పార్టీకి కలిసి వస్తుందా లేక అచ్చెన్న మరిన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతాడా అనే సందిగ్ధత అందరిలోనూ నెలకొంది. స్వతహాగా దూకుడు స్వభావంతో ఉండే అచ్చెన్న ఎవర్ని లెక్క చేసే రకం కాదు. దూకుడుగా ముందుకు వెళ్ళడమే తప్ప, ఆ తర్వాత తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాలపై ఆలోచించే రకం అంతకన్నా కాదు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కి సహనం, చాలా కావాలి.
ఎంతో మంది నాయకులు తరచుగా వచ్చి కలుస్తుంటారు. వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం వారిదగ్గర తీసుకోవడం ఇలా ఎన్నో చేయాలి. కానీ ఆ ఓపిక, సహనం అచ్చెన్న కు లేదు  అనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. ప్రస్తుతం టిడిపి ఉన్న పరిస్థితుల్లో అచ్చెన్న తప్ప మరో నాయకుడు ఎవరు కనిపించడం లేదు. అచ్చెన్న వివాదాలకు కేంద్ర బిందువుగా మారినా, వివాదరహితుడిగా పనిచేసినా బాబుకి ఉన్న ఆప్షన్ ఆయన ఒక్కరే.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news