హాస్య నటుడు అలీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెరమీద కనిపిస్తూనే.. నవ్వులు పూయించే నటుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి స్తానం దక్కించుకున్న ఆయన తాజాగా సీఎం జగన్‌పై సంచలన కామెంట్లు చేశారు. గత ఏడాది ఎన్నికలకు ముందు తీవ్రస్థాయిలో తర్జన భర్జనల అనంతరం.. జనసేనలో చేరిపోతారని అనుకున్న అలీ.. నేరుగా వచ్చి వైసీపీ తర్థం పుచ్చుకున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం సీటును అప్పట్లో ఆశించారని ప్రచారం జరిగింది. అయినప్పటికీ.. జగన్ ఆయనకు ఇవ్వలేదు.
కానీ, అలీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. రూపాయి కూడా ఆశించకుండా.. జగన్‌కు ప్రచారం చేసి పెట్టారు. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడా దూకుడు ప్రదర్శించలేదు. నేను ప్రచారం చేశాను.. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చింది.. అని చెప్పుకోలేదు. ఎన్నికలకు ముందు ఎంత వినయంతో ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే వినయంతో ఉన్న అలీ.. తాజాగా.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌పైనా, ఆయన పాలనపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలీ ఏమన్నారంటే.. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారని చెప్పారు. -అయితే, ఇక్కడ రాజకీయంగా లాజిక్ ఏంటంటే.. ఎంతో మంది సినీనటులు.. జగన్ నుంచి లబ్ధి పొందారు.
కొన్నాళ్ల కిందట అక్కినేని నాగార్జున, చిరంజీవి వంటివారు నేరుగా తాడేపల్లి వచ్చి.. జగన్‌తో భేటీ అయి.. తెలుగు పరిశ్రమకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు. అంతే తప్ప.. జగన్పై ఒక్క అనుకూల కామెంట్ కూడా చేయలేక పోయారు. కానీ, ఏమీ ఆశించని అలీ మాత్రం జగన్‌పై ప్రశంసల జల్లుకురిపించడం.. ఆయనలోని నిజాయితీని చాటుతోందని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash