ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. రాజధాని రైతులు పోరాట బావుటా ఎగరవేసి నేటికి 1200 రోజులు. ప్రభుత్వ దాష్టీకం, పోలీసుల దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులను తట్టుకుని రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.
అమరావతే రాజధానిగా కొనసాగుతుందని 2019 ఎన్నికల సమయంలో చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి మాట తప్పారు. జగన్ నిర్ణయంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం తమకు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించారు. 2019 డిసెంబర్ 17న ప్రారంభమైన నిరసనలు వివిధ రూపాల్లో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులకు మద్దతుగా ఉద్యమాలు నిర్వహించారు.
100వ రోజు నిరసనలు, 200వ రోజు అమరావతి అమరవీరులకు ప్రత్యేక శ్రద్ధాంజలి, 300వ రోజు అమరవీరుల ఫ్లెక్సీలతో శవయాత్ర, 400వ రోజు జన భేరి, 500వ రోజు రాష్ట్ర, జాతీయ నాయకులతో జూమ్ సదస్సు, 600వ రోజు మానవహారాలు, 700 రోజులకు తిరుమలకు పాదయాత్ర, 800వ రోజు సందర్భంగా రాజధాని రైతులు 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు.
ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి చేసిన సందర్భంగా రైతులు రెండో విడత పాదయాత్ర చేపట్టారు. అరసవెల్లి వరకూ చేపట్టిన మహా పాదయాత్రను ప్రభుత్వం నిబంధనల పేరుతో అడుగడుగునా.. అడ్డుతగిలినా ముందుకు సాగారు. ఉద్యమం ప్రారంభించిన నేటికి 12వందల రోజులు అవుతున్న సందర్భంగా రైతులు అన్ని పార్టీల నేతలతో కలిసి ప్రత్యేక నిరసన తెలుపనున్నారు.