బీజేపీ మ‌త వ్యూహంతో సోముకు చిక్కులే..!

-

ఏ పార్టీ అయినా.. అభివృద్ది ప‌థంలో ముందుకు సాగాలంటే.. ఎవ‌రిని న‌మ్ముకోవాలి ? ఏ దిశ‌గా అడుగులు వేయాలి ?  ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగాలి ?  ఈ విష‌యంలో ఎవ‌రు చెప్పినా.. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకోవాలి.. ప్ర‌జాభిమానం సాధించాల‌నే చెబుతారు. క్షేత్ర‌స్థాయిలో పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. దానికి త‌గిన విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలి. గ్రామ గ్రామానా పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఏ పార్టీ అయినా.. ప‌దికాలాలు మ‌న‌గ‌ల‌గుతుంద‌నేది వాస్త‌వం. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలోకి వ‌చ్చిన పార్టీలు సాధించిన రికార్డు కూడా ఇదే.

అయితే, దీనికి భిన్నంగా ముందుకు సాగుతోంద‌నే భావ‌న.. ఏపీ బీజేపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకోవ‌డం మానేసి.. మ‌తాన్ని న‌మ్ముకుని ముందుకు సాగితే.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కేనా ?  ఇప్పుడున్న బీజేపీ నేత‌ల ల‌క్ష్యం మేర‌కు వ‌చ్చే 2024 నాటికి ఏపీలో అధికారంలోకి రావాలి. దీనికిగాను.. క‌స‌ర‌త్తు జ‌ర‌గాలి. అయితే, ఆ క‌స‌ర‌త్తు.. మ‌తం ప‌రంగానో.. కులం ప‌రంగానో.. సాగితే.. క‌ష్ట‌మేన‌నే భావ‌న ఉంది. రాష్ట్రంలో సోము వీర్రాజు బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. రెండు విష‌యాల‌పై ఆయ‌న స్పందించారు.

ఒక‌టి.. అంత‌ర్వేది.. ర‌థం ద‌గ్ధం, రెండు విజ‌య‌వాడ దుర్గ‌మ్మ గుడిలో వెండి సింహాల అదృశ్యం. ఈ రెండింటి విష‌యంలో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అంత‌ర్వేది విష‌యంలో ఉద్య‌మానికి కూడా పిలుపునిచ్చారు. ఇవి త‌ప్ప ప్ర‌జా ఉద్య‌మాల‌కు ఆయ‌న ఎక్క‌డా చోటు పెట్ట‌లేదు. నిజానికి వాటిపై ఎంత వ‌ర‌కు స్పందించాలో.. అంత‌వ‌ర‌కు స్పందించి వ‌దిలేసి.. మిగిలిన ఉద్య‌మాల‌పై దృష్టి పెట్టి ఉంటే.. ప‌రిస్థితి భిన్నంగా ఉండేది.

కానీ, కేవ‌లం హిందూమ‌తానికి సంబంధించిన అంశాల‌కే ప్రాధాన్యం ఇస్తే.. మిగిలిన వ‌ర్గాల‌కు పార్టీ చేరువ అయ్యేనా?  రాష్ట్రంలో అన్ని సామాజిక వ‌ర్గాలు, అన్ని మ‌తాల‌కు ఓటు ప్రాధాన్యం ఉన్న‌ప్పుడు.. అధికారంలోకి రావాల‌నుకుంటున్న పార్టీ కేవలం ఒక్క‌దానికే ప‌రిమితం కావ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి సోము ఏం చేస్తారో చూడాలి.

-vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Latest news