ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హస్తినలో హీట్ పెంచుతున్నాయి. నిన్నటికి నిన్న ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చలు జరిపారు. ఉదయం హస్తిన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు.
ఇతర కేబినేట్ మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులను ప్రధానికి వివరించనున్న సీఎం జగన్.. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్. సీఎం ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.