అసలు వెనక ముందు ఆలోచిస్తున్నా డా ? అసలు ఈ కరోనా కష్టకాలంలో అంతంత సొమ్ములు ఎక్కడి నుంచి తెస్తున్నాడు. కొత్త పథకాలను ఎలా అమలు చేస్తున్నాడు. ఇప్పటికే అమలు చేసిన భారీ బడ్జెట్ పథకాలు ఏ ఆటంకం లేకుండా ఎలా సాగుతున్నాయి ? అన్ని రాష్ట్రాలు ఆర్థికమాంద్యంతో గోల గోల చేస్తుంటే, ఏపీలో జగన్ ఏ విధంగా ఏ ఇబ్బంది లేకుండా పాలన సాగిస్తున్నాడు ? ఇలా అనేక విషయాలు చాలా కాలంగా ఎవరికీ అంతుబట్టడం లేదు. అసలు ఆదాయం తగ్గిపోయినా, జగన్ మొండి ధైర్యంతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు అనేది సొంత పార్టీ నేతలకు సైతం అంతుచిక్కడం లేదు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే, ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని జగన్ చెప్పడమే కాక చేసి చూపిస్తున్నాడు. క్రమక్రమంగా షాపుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నాడు. దీని కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అలాగే కేంద్రం కూడా అంతంత మాత్రంగానే నిధులను విధుల్చుతోంది. ఈ పరిస్థితుల్లో మద్యపాన నిషేధం విధిస్తూ ముందుకు వెళితే, రాష్ట్రం ఆదాయం మరింత క్షీణించడంతో పాటు, అప్పులు పెరిగిపోతాయి. ఇది ఆర్థిక నిపుణులకు సైతం ఆందోళన కలిగిస్తోంది. అయినా జగన్ ఎక్కడ తగ్గడంలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు.
అలాగే తాను మాట ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నా అది సాధ్యం కాదని అధికారులు చెప్పేస్తున్నారు. ఏపీకి సరిహద్దు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం లేకపోవడంతో అక్కడ నుంచి పెద్ద ఎత్తున మద్యం తరలి వస్తోంది. ఎన్ని రకాలుగా మద్యం అక్రమ రవాణా అడ్డుకుందామని ప్రయత్నిస్తున్న, ఏదో ఒక రూపంలో అక్రమంగా ఏపీకి మద్యం తరలి వస్తోంది. దీనికితోడు ఏపీ కి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో, మద్యపాన నిషేధం అమలు సాధ్యమయ్యే పని కాదు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. జగన్ ఎన్నికలకు ముందు మాట ఇచ్చినా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిగా మద్యం ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతే, ఏపీ కోలుకోలేని విధంగా ఆర్థిక కష్టాలతో సతమతం అయిపోతుంది.
రానున్న రోజుల్లో ఏపీకి ఆర్థికంగా గడ్డుకాలమే కావడంతో, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు సాధ్యమయ్యే పని కాదు అని, ఈ విషయంలో జగన్ సైతం కాంప్రమైజ్ అవ్వాల్సిందేనని ఆర్థిక నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
-Surya