జీవో నెంబర్ 1ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

-

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోలను కట్టడి చేసేలా ఏపీ సర్కార్ ఈ ఏడాది జనవరి 2న జీవో నంబర్‌ 1ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

‘‘రోడ్‌ షోలను కట్టడి చేసేలా జీవో ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారు. పోలీస్‌ యాక్ట్‌ 30కు భిన్నంగా జీవో జారీ చేశారు’’ అని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం జీవోను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.

రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసం ప్రభుత్వం జీవో1 తీసుకొచ్చిందని పేర్కొంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్‌ నేత గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఐఏవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news