ఆంధ్రప్రదేశ్‌లో వరుస వివాదాల్లో పోలీసులు చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులు మొదలు, బెదిరింపులు, ఒక వర్గానికి కొమ్ము కాయడం వంటి అనేక అంశాల్లో పోలీసులు చిక్కుకుంటున్నారు. పోలీసుల ఆగడాలు ఎక్కువయ్యాయా? లేక అక్రమాలపై చర్యలు పెరిగాయా? అనేది కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఓ వివాదంలో స్టేషన్‌కి తీసుకొచ్చిన దళిత యువకుడికి ఒక ఎస్సై గుండు కొట్టించారు. ఆ వ్యవహారం పెద్దది కావడంతో ఆయన అరెస్టై, జైలుకు కూడా వెళ్లారు. అలానే మాస్క్ కట్టుకోలేదని మరో యువకుడిని వేధించి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారన్న ఆరోపణలతో మరో ఎస్సై సస్పెండ్ అయ్యారు.
ఇవి తాజా ఘటనలు కాగా పోలీసుల మీద కేసుల్లో ఇప్పుడు ఏపీ నెంబర్ వన్ గా నిలిచింది. తాజాగా పోలీసుల మీద నమోదయిన లెక్కలు విడుదల అయ్యాయి. పోలీసులకు వ్యతిరేకంగా నమోదు అయిన కేసుల్లో భారతదేశం మొత్తం మీద అంతటా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన తాజా క్రైమ్ ఇన్ ఇండియా 2019 నివేదిక ప్రకారం. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో పోలీసులపై నమోదు అయిన కేసుల్లో 41% మంది పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని తేలింది/ మొత్తం 4,068 కేసులు పోలీసుల మీద నమోదయ్యాయి. అందులో ఏపీలో అత్యధికంగా 1,681 కేసులు నమోదు అయ్యాయి.